Chandrababu : నాపై రాళ్ల దాడికి దిగుతున్నారు.. తనను వేధిస్తున్నారు
జగన్ తనపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజాంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజాంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. తనను, తన కుటుంబాన్ని వేధించారన్నారు. తనపై చివరకు రాళ్లదాడికి కూడా దిగుతున్నారని చంద్రబాబు అన్నారు. తాను అరెస్టయ్యాయనన్న బెంగతో 203 మంది రాష్ట్రంలో ప్రాణాలు వదిలారని అన్నారు. ఆ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి ధైర్యం చెప్పారన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న నేత పవన్ కల్యాణ్ అని, మోదీ మూడో సారి ప్రధాని అవుతారని, ముగ్గురం కలసి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
నా అనుభవంతో...
తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దూసుకుపోయేలా చేస్తానని తెలిపారు. తాను అప్పులు చేసి సంక్షేమం చేయనని, సంపదను సృష్టించి పేదలకు పంచుతానని హామీ ఇచ్చారు. వచ్చిన ఆదాయాన్ని మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టాలన్నారు. వైసీపీ పాలనలో ఖర్చులు పెరిగాయని, సంపద పెరగలేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. మహిళలను లక్షాధికారులను చేస్తానని ప్రకటించారు. జగన్ కు పేదల మీద ప్రేమ లేదని, కేవలం ఆస్తుల మీద మాత్రమే ప్రేమ ఉందని ఆయన అన్నారు. విశాఖలో వైవీ సుబ్బారెడ్డి పెత్తనమేంటని ఆయన ప్రశనించారు. తాను అధికారంలో ఉండగా ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చానని, ఈ జగన్ వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు.