Chandrababu : త్వరలోనే బయటకు వస్తా : చంద్రబాబు లేఖ
ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఆయన రాజమండ్రి జైలులో 43 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు
ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఆయన రాజమండ్రి జైలులో 43 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. తనను ప్రజల నుంచి ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని లేఖలో పేర్కొన్నారు. నలభై ఐదేళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలను, విశ్వసనీయతను ఎవరూ చెరపేయలేరని పేర్కొన్నారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందన్న ఆయన తాను త్వరలోనే బయటకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధి కోసమే...
ములాఖత్ భాగంగా తనను కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు ఈ ఈ లేఖ ఇచ్చి పంపారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే ప్రజల సంకల్పంలో తాను ఉన్నానని పేర్కొన్నారు. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తుంటే 45 ఏళ్ల ప్రజాజీవితం తన కళ్లముందు కదలాడుతుందని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానమంతా ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందనన ఆయన తాను మీ మధ్య తిరగలేకపోవచ్చు కానీ, అభివృద్ధి రూపంలో కనిపిస్తానని పేర్కొన్నారు.
త్వరలోనే మ్యానిఫేస్టో...
ఈ చీకట్లు తాత్కాలికమేనని, సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి అని చంద్రబాబు తన లేఖలో తెలిపారు. సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవన్న ఆయన జైలు ఊచలు తనను ప్రజల నుంచి దూరం చేయలేవని అన్నారు. తాను తప్పు చేయనని, చేయనివ్వనని ఆయన తెలిపారు. ఈ దసరాకి మ్యానిఫేస్టోను విడుదల చేస్తానని మహానాడులో ప్రకటించానని, త్వరలో బయటకు వచ్చి పూర్తి స్థాయి మ్యానిఫేస్టోను విడుదల చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నడూ బయటకు రాని తన కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చేలా చేశారని ఆయన తెలిపారు.