నా స్నేహితులే గుడివాడలో దాన్ని నిర్వహించారు.. వంశీ ప్రకటన
గుడివాడలో జరిగింది క్యాసినో కాని, క్యాబరో కాదని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు.
గుడివాడలో జరిగింది క్యాసినో కాని, క్యాబరో కాదని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గుడివాడలో అసలు క్యాసినోను నిర్వహించలేదన్నారు. సంక్రాంతి మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట వంటివి జరుగుతున్నాయన్నారు. తాము టీడీపీ హయాంలో కూడా ఇలాంటివి నిర్వహించామని చెప్పారు. గుడివాడలో శిబిరం నిర్వహించింది ఎవరో కొడాలి నానికి తెలియదన్నారు. తనకు వారు స్నేహితులే అయినా అక్కడ శిబిరం నిర్వహిస్తున్నట్లు తనకు కూడా తెలియదని చెప్పారు.
నానికి తెలియదు....
తన స్నేహితులే ఈ శిబిరాన్ని నిర్వహించారని వల్లభనేని వంశీ తెలిపారు. కొడాలి నాని ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయనకు వారెవరో తెలియదన్నారు. గతంలో తాను, బోడెప్రసాద్ ఎమ్మెల్యేలుగా కోడిపందేలను, పేకాట శిబిరాలను ఆ మూడు రోజుల పాటు చూసీ చూడనట్లు వ్యవహరించేవారన్నారు. ఇది కే కన్వెన్షన్ సెంటర్ లో జరగలేదని, దాని పక్కన ఉన్న లే అవుట్ లో ఆ శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. కొడాలి నాని మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనపై బురద జల్లే కార్యక్రమాన్ని టీడీపీ మొదలయిందన్నారు.
ఐక్యరాజ్యసమితికి చేసుకోమను...
కొడాలి నానికి కరోనా వచ్చి హైదరాబాద్ లో ఉన్నారని, ఆయనకు ఈ అంశంతో సంబంధం లేదన్నారు. చంద్రబాబు కూడా తన హయాంలో ఇలాంటివి జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు నిర్వహించిన వారే శిబిరాన్ని నిర్వహించారని వల్లభనేని వంశీ తెలిపారు. క్యాసినో జరగకపోతే జరిగాయని అల్లరి చేస్తుంటే ఏం చేయాలన్నారు. డీజీపీకి కాకుంటే ఐక్యరాజ్యసమతికి, అమెరికా ప్రెసిడెంట్ కు టీడీపీ ఫిర్యాదు చేసుకోవచ్చని వల్లభనేని వంశీ అన్నారు.