డీజీపీకి చంద్రబాబు లేఖ
రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగినవి చిన్న ఘటనలే అన్న డీజీపీ వ్యాఖ్యలను చంద్రబాబు తప్పు పట్టారు. వైసీపీతో పోలీసులు కుమ్మక్కయ్యాయరని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. తాను కుప్పం నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించానని, ఇప్పటి వరకూ ఎలాంటి హింసాత్మ ఘటనలు జరగలేదని తెలిపారు. పోలీసుల మద్దతుతో వైసీపీ నేతలు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
పోలీసులు కుమ్మక్కై....
తాను గత నెల 24 నుంచి 26వ తేదీ వరకూ కుప్పం నియోజకవర్గంలో పర్యటించానని, అయితే బయట వ్యక్తులను రప్పించి హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా తన పర్యటన ముగిసిన కొద్దిసేపటికే టీడీపీ నేతలను అరెస్ట్ చేశారని, ఇదేమి న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గూండాలను ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదన్నారు. సీఐ శ్రీధర్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.