Central Cabinet : కేంద్ర మంత్రివర్గంలోకి టీడీపీ.. వారికే ఛాన్స్ అట
ఎన్డీఏలో అతి పెద్ద పార్టీ అయిన టీడీపీకి మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం హస్తినలో జరుగుతుంది
కేంద్రంలో మూడోసారి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన ప్రధానిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల వారికి ఎక్కువ సంఖ్యలోనే కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏలో అతి పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం హస్తినలో జరుగుతుంది. అందులో రెండు కేబినెట్ ర్యాంక్ పదవులతో పాటు మరో రెండు సహాయ మంత్రి పదవులు లభిస్తాయని చెబుతున్నారు.
నలుగురి పేర్లను...
ఈ నేపథ్యంలో ఎవరిని కేంద్ర మంత్రులుగా ఎంపిక చేస్తారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. గత ఎన్నికలతో పాటు వరసగా మూడు సార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో గుంటూరు ఎంపీగా ఎన్నికయిన పెమ్మసాని చంద్రశేఖర్ పేరు కూడా బలంగా వినపడుతుంది. స్వతహాగా వ్యాపారవేత్త కావడంతో ఆయనకు ఇస్తే మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి తీసుకు వస్తారన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. ఇక రెడ్డి సామాజికవర్గం నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు బాగా వినపడుతుంది. మరొకరు ఎస్సీ నియోజవకర్గం నుంచి ఎంపిక చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.