Andhra Pradesh : అయ్యబాబోయ్.. ఏపీలో దంచికొడుతున్న ఎండలు
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వడగాలుల తీవ్రత కూడా మొదలయింది.
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వడగాలుల తీవ్రత కూడా మొదలయింది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. నెల రోజుల పాటు వడగాలులు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. బయటకు వస్తే మాడు చురుక్కుమంటుంది. మరొక వైపు ఉక్కపోత, వడగాల్పులతో చెమటతో శరీరం తడిసి ముద్దవుతుంది.
అధిక ఉష్ణోగ్రతలు...
ఈరోజు ముప్పయి ఒక్క మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలపింది. 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయని ఊహించుకుంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కోరుతుంది.