Thalliki Vandanam: గుడ్ న్యూస్: తల్లికి వందనంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
తల్లికి వందనం పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక
తల్లికి వందనం పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానం చెప్పారు. తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. పైగా ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామన్నారు. నిబంధనలు రూపొందించేందుకు కాస్త సమయం కావాలన్నారు. తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు.
ఇక ఏపీలో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రకటించారు. వలంటీర్ వ్యవస్థపై స్పష్టత ఇవ్వాలంటూ వైసీపీ నేత శివప్రసాద్‌రెడ్డి సభలో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి వీరాంజనేయులు సమాధానమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తెలిపారు. వారికి ఇస్తున్న గౌరవ వేతనం పెంపుపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సభకు నివేదించిన ప్రశ్నకు మంత్రి డోలా వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు.