హెచ్చరిక.. మూడురోజులు బయటకు రాకండి
పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40-43 డిగ్రీల వరకూ నమోదవుతాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో ఎండల తీవ్రత..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకీ ఉక్కపోత విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి రెండు, మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40-43 డిగ్రీల వరకూ నమోదవుతాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది. ఇదే సమయంలో కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది.
తెలంగాణలోనే ఎండలు మండుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీన పడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపుకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల వరకూ నమోదవుతాయని పేర్కొంది. అలాగే వేడిగాలులు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుకు సమయం దగ్గరపడుతోంది. గురువారం మాల్దీవులు, కొమరిన్, ఆగ్రేయ, అరేబియా సముద్రం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతం నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ విభాగం తెలిపింది. రేపు లేదా ఎల్లుండి నైరుతి పవనాలు కేరళను తాకవచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెల 5వ తేదీన ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది. ఈ అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల రాక ఆలస్యం కావొచ్చని తెలిపింది.