తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం నాడు 65,416 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు అని టీటీడీ తెలిపింది.
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి 7 గంటలకు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు.