Tirumala : తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ ... ఒక్కసారిగా పెరగడంతో?

తిరుమలలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

Update: 2024-12-06 03:09 GMT

తిరుమలలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. కంపార్ట్ మెంట్లన్నీభక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి కూడా గంటల సమయం పడుతుంది. సహజంగా శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం తిరుమలకు చేరుకున్న భక్తులు శనివారం కూడా స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుని ఆ తర్వాత ఆదివారం తమ గమ్యస్థానాలకు తిరిగి వెళతారు. వారంలో మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మూడు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అన్న ప్రసాదం క్యాంటిన్ నుంచి లడ్డూల కౌంటర్ వరకూ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శని, ఆదివారాల్లో కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు.

అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిఉన్నారు. క్యూ లైన్ బయట టీబీసీ వరకూ విస్తరించింది. క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా అన్నప్రసాదాలను, మజ్జిగను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్ లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 46,957 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,560 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News