రమణ దీక్షితులుపై టీటీడీ వేటు

తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ

Update: 2024-02-26 10:42 GMT

తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. రమణ దీక్షితుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ ఆయన్ను పదవి నుంచి తొలగించింది. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు టీటీడీ అధికారులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయలర్‌లపై నీచమైన ఆరోపణలు చేశారని, దీంతో రమణ దీక్షితులును ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయించినట్లు చైర్మన్‌ భూమన తెలిపారు.

తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని రమణ దీక్షితులు ఆరోపించిన వీడియో వైరల్ అయింది. ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్దసమస్య అని ఆ వీడియోలో ఉంది.
వీడియో వైరల్‌ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్‌ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్‌కి గురైనట్టు ట్వీట్ చేశారు. తిరుమల అధికారులతో ఉన్న తనకు సత్సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు.


Tags:    

Similar News