నేడు బాబుకు "కీలకం"
ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు న్యాయపరంగా ముఖ్యమైన రోజు
ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు న్యాయపరంగా ముఖ్యమైన రోజు. సుప్రీంకోర్టులో నేడు క్వాష్ పిటీషన్ పై విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న అంచనాలతో టీడీపీ నేతలున్నారు. అదే జరిగితే తమ అధినేత త్వరగా జైలు నుంచి బయటకు వస్తారని భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు కొట్టి వేయడంతో క్వాష్ పిటీషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టులోనూ...
మరోవైపు ఈరోజు ఏపీ హైకోర్టులో అంగళ్లు కేసులో తీర్పు వెలువడనుంది. అంగళ్లు కేసులో చంద్రబాబు మొదటి నిందితుడిగా ఉన్నారు. ఆయన తనను అరెస్ట్ చేయవద్దని, విచారణకు సహకరిస్తానని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ వేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు నిన్న తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువరించనుంది. దీంతో ఏపీలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండు కేసుల్లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు.