Visakha Mlc Elections : బొత్స కు ప్రత్యర్థిని ప్రకటించలేదుగా... ఏకగ్రీవం అవుతారా?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను దాఖలు చేయడానికి నేడు ఆఖరి రోజు
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను దాఖలు చేయడానికి నేడు ఆఖరి రోజు. ఈరోజుతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగియనుంది. అయితే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థి పేరును ప్రకటించలేదు. ఈరోజు నామినేషన్లు వేయకపోతే ఇక వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అవుతారు. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అనేక మంది పేర్లను పరిశీలించారు. పేరు ఖరారయినట్లు ప్రచారం జరిగినా అధికారికంగా చంద్రబాబు ప్రకటించలేదు.
కొన్ని పేర్లు వినిపించినా...
పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి పేరును ప్రకటించారని ప్రచారం జరిగినప్పటికీ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈరోజు నామినేషన్లకు ఆఖరిగడువు కావడంతో ఈరోజు ప్రకటించాల్సి ఉంది. బైరా దిలీప్ చక్రవర్తి పేరుతో పాటు పీలా గోవింద సత్యనారాయణ పేరు కూడా బలంగా వినిపించింది. కానీ చంద్రబాబు మాత్రం అధికారికంగా బయటకు చెప్పకపోవడంతో ఉత్కంఠతో విశాఖ జిల్లా టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇంకో రకమైన వాదన కూడా వినిపిస్తుంది.
బలం లేకపోవడంతో...
విశాఖ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 850 ఓట్లుండగా, అందులో 550 ఓట్లు వైసీపీికి ఉన్నాయి. ఈ ఓట్లలో ఎక్కువ భాగం వాళ్లు క్యాంప్‌నకు తరలించారు. ఆగస్టు 30వ తేదీన ఎన్నిక జరుగుతుంది. అప్పటి వరకూ క్యాంప్ వదిలి బయటకు రారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. పోటీ చేసి ఓటమి పాలయికంటే గౌరవంగా ఉంటుందని చంద్రబాబు భావించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే టీడీపీ పోటీ చేయకపోవచ్చు. మరి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది.