అనకాపల్లి జిల్లాలో ట్రైన్ యాక్సిడెంట్

వరుసగా రైలు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో తాజాగా గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది

Update: 2023-06-14 03:37 GMT

వరుసగా రైలు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో తాజాగా గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ- లింగంపల్లి(12805)-జన్మభూమి, విశాఖ-విజయవాడ (22701)-ఉదయ్‌, విశాఖ-గుంటూరు(17240)- సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నేడు రద్దు చేశారు. ఆ రైళ్ల తిరుగు ప్రయాణం కూడా రద్దయింది. విశాఖ- సికింద్రాబాద్‌ (20833)-వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడు గంటలు ఆలస్యంగా వెళ్లనుంది. విశాఖ నుంచి ఉదయం 5.45కి బయల్దేరాల్సిన వందేభారత్‌.. 8.45కి బయల్దేరనుంది. విశాఖతోపాటు దువ్వాడ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచి పోయాయి.

బాలాసోర్ ప్రమాదం:
ఒడిశా రైలు ప్రమాదం ఘటన దేశమంతటినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న అత్యంత భయంకర ప్రమాదంలో 280 మంది ప్రాణాలు కోల్పోగా వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహానగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్ నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీ కొట్టింది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఢీ కొట్టడంతో 7-8 భోగీలు పట్టాలు తప్పి పక్కకు దొర్లిపోయాయి. కొన్ని భోగీలు గాల్లో లేచాయి. ఈలోగా అదే సమయంలో పక్కన ఉన్న మెయిన్ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ చివరి భోగీలు కోరమాండల్ భోగీల్ని ఢీ కొట్టడంతో ఆ రైలు కూడా పట్టాలు తప్పింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనపై కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం కావడంతో సీబీఐకు దర్యాప్తు అప్పగించారు.


Tags:    

Similar News