వేమన విగ్రహం స్థానంలో వైఎస్సార్ విగ్రహం.. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఏమన్నారంటే
కడపలోని యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అంశం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి మాట్లాడుతూ ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. అభివృద్ధి పనుల్లో భాగంగా విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశామని.. మెయిన్ గేట్ వద్ద వేమన విగ్రహం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యూనివర్శిటీ వ్యవస్థాపకులు దివంగత రాజశేఖరరెడ్డి కావడంతో వేమన విగ్రహం స్థానంలో ఆయన విగ్రహాన్ని పెట్టామని తెలిపారు. తాము కొత్త విగ్రహాలను తీసుకురాలేదని, ఉన్న విగ్రహాలనే మరో చోటుకు మార్చడం జరిగిందని చెప్పారు. కొత్త అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల అక్కడున్న స్థలంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.