Vijayawada : విజయవాడకు ఎందుకు ఈ దుర్గతి.. మరో హైడ్రా ఏర్పాటు చేయాల్సిందేనా?

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ వణికిపోతుంది. ఈరోజు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది

Update: 2024-08-31 13:22 GMT

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ వణికిపోతుంది. ఈరోజు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. గత రెండు దశాబ్దాలలో ఇంతటి భారీ వర్షం కురవడం ఎప్పుడూ లేదు. ఇరవై ఏళ్ల క్రితం భారీ వర్షాలు కురిసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయవాడలో పర్యటించి వర్షపు నీరు పోయేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుడమేరు కాల్వ నుంచి నీటిని పోలవరం కుడికాల్వలోకి కలిపేలా ప్రణాళిక రచించారు. తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ బెజవాడను పట్టించుకోలేదు. బెజవాడపై పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

అన్నీ ఆక్రమణలే...
ిఇక విజయవాడలో అన్నీ ఆక్రమణలే.. కొండలు, కాల్వగట్టులు ఒకటేమిటి అన్నీ ఆక్రమణలే. అయితే అందరూ పేదలే అయినా వారు ఇళ్లు నిర్మాణం చేపట్టడంతో కురిసిన నీరు ఎటూ పోవడానికి వీలులేకుండా పోయింది. కృష్ణానది కరకట్ట మీదనే ఇళ్లను నిర్మించారు. నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్థంగా ఉంది. ఎప్పుడో బ్రిటీష్ వాళ్లు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ తప్పించి కార్పొరేషన్ అధికారులు నూతన డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టలేదు. కొన్ని చోట్ల భూగర్భ డ్రైనేజీ పనులు చేసినప్పటికీ వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రహదారులపై మోకాలి లోతు నీరు నిలిచిందని నిపుణులు చెబుతున్నారు.
కొండలను ఆక్రమించి...
డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. నాలాలను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నా వాటిని తొలిగించే ప్రయత్నం చేయలేదు. అయితే వీటికి కమ్యునిస్టు పార్టీలు ఎప్పటికప్పుడు అడ్డుకోవడం వల్ల అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. కామ్రేడ్లు ఉద్యమిస్తారని భావించి ఆక్రమణల జోలికి వెళ్లడం లేదు. ఇక కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. విజయవాడ కొండను ఆక్రమించి మరీ ఇల్లు నిర్మించారు. కొండపై నిర్మించిన ఇళ్లకు విద్యుత్తు సౌకర్యంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. అందుకే బెజవాడ మునిగిపోయిన పాపం పాలకులదే అని ఖచ్చితంగా చెప్పాలి.


Tags:    

Similar News