Andhra Pradesh : మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. మళ్లీ వాయుగుండం
విశాఖ వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. మరో ముప్పు పొంచి ఉందని తెలిపింది
ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్షాల ముప్పు తప్పేట్లు లేదు. నిన్నటి వరకూ ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక చోట్ల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.
మరోముప్పు...
అయితే విశాఖ వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. మరో ముప్పు పొంచి ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని కూడా తెలిపింది. దీంతో ఏపీకి మరోసారి భారీ వర్షాలు తప్పవని చెప్పకనే చెప్పినట్లయింది. దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని తెలిపింది.