Fengal Cyclone : ఏపీకి ఈ తుపాను ముప్పులేమిటో? నవంబరు నెల నుంచి దడ మొదలు
నవంబరు నెల వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుండెల్లో దడ పుట్టుకొస్తుంది. తుపానులు, భారీ వర్షాలతో నవంబరు నెల ప్రారంభమవుతుంది
నవంబరు నెల వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుండెల్లో దడ పుట్టుకొస్తుంది. తుపానులు, భారీ వర్షాలతో నవంబరు నెల ప్రారంభమవుతుంది. ఇటీవల కాలంలో వరస తుపాన్లు ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో సాధారణ ప్రజలతో పాటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దాచిపెట్టుకున్న ధాన్యం సయితం పనికి రాకుండా పోతుంది. వరసగా కురుస్తున్న వర్షాలతో పంటలు చేతికి అంది వచ్చి వాటిని విక్రయించేంత వరకూ నమ్మకం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఫెంగల్ తుపాను అల్పపీడనంగా మారి మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తమిళనాడులో బీభత్సం...
తమిళనాడులో భారీ వర్షం కారణంగా పద్దెనిమిది మంది మరణించారు. తిరువణ్ణామలైలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. ఇక అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తిరువణ్ణామలై లో ఇళ్లపై కొండచరియలు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో పనులు లేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాలకు తరలించినా పెద్దయెత్తున ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఇక పంట నష్టం తీవ్రత ఎంత అనేది అంచనా వేయడం కూడా కష్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టం పరిహారం ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
ఈరో్జు కూడా...
ఈరోజు కూడా ఫెంగల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నేడు కూడా వర్షం అధికంగా పడే అవకాశముందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అదే సమయంలో నదులు, వాగులు దాటే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఏపీలో వరస తుపాన్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఏపీ తట్టుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. నిన్న చిత్తూరు జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాలో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.