వైసీపీ వణికిపోతుందట.....ఇది కదూ జోకంటే...?
చంద్రబాబు కుప్పం పర్యటనతో వైసీపీ గుండెల్లో ప్రకంపనలు బయలుదేరాయట. కుప్పం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు రేపిందట.
చంద్రబాబు కుప్పం పర్యటనతో వైసీపీ గుండెల్లో ప్రకంపనలు బయలుదేరాయట. కుప్పం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు రేపిందట. వైసీపీ నేతలకు ఇక నిద్ర కరువయిందట. ఏదైనా చెబితే అర్థం అనేది ఉండాలి. కుప్పం ఎవరి నియోజకవర్గం? అక్కడకు చంద్రబాబు వెళ్లింది ఎందుకు? తన పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు మూడు రోజులు కుప్పం లో పర్యటించారు. మున్సిపల్ ఎన్నికలలో దారుణ ఓటమి తర్వాత ఆయన అవమానాన్ని తట్టుకోలేకపోయారు.
పార్టీని సెట్ చేసుకునేందుకే....
అందుకే కుప్పంలో తన పార్టీ పరిస్థితిని సెట్ చేసుకునేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. మూడు రోజులు ఉండి తన పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తనకు వెన్నుపోటు పొడిచిన వారిని గుర్తించి వారిని తన పర్యటనలో దూరం కూడా పెట్టారు. ఇదంతా ఎందుకు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తిరిగి కుప్పం నియోజకవర్గం నుంచి గెలవాలన్నదే. మరి వైసీపీకి ఎందుకు ప్రకంపనలు పుడతాయి?
విజయం సాధిస్తే....
చంద్రబాబు కుప్పంలో ఏడుసార్లు నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయనకు ఇక్కడ ఓటమి అన్నది తెలీదు. వైసీపీకి కొత్తగా పోయేదేమీ లేదు. ప్రకంపనలు పుట్టాల్సినపనిలేదు. ఎందుకంటే కుప్పంలో గెలిస్తే వైసీపీ జాక్ పాట్ కొట్టినట్లే. లేకపోతే జరిగే నష్టమూ లేదు. అలాంటిది చంద్రబాబు పర్యటనతో ఇప్పుడు వైసీపీలో భయం ఎందుకు పుడుతుంది? పెద్దిరెడ్డి పై మైనింగ్ అక్రమాల ఆరోపణలు చేస్తే వణుకుపుడుతుందా? అధికారంలో ఉన్న వారు ఈ విమర్శలకు భయపడతారా? ఇంతకీ కుప్పంలో వణుకుతున్న దెవరు? వణికిస్తుంది ఎవరు? మరి ఇది కదూ జోకంటే?