మైలవరం పై జగన్ ఫోకస్
మైలవరం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు
పార్టీలో విభేదాలున్న నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ పెట్టారు. వరసగా నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమై నేరుగా వారితో చర్చిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాను అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని హితబోధ చేస్తున్నారు. ఒక్కటై ఉంటేనే ప్రత్యర్థులను సులువుగా ఓడించవచ్చని, అందుకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ చిత్తశుద్ధితో కలసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా? లేదా? అన్నది చూడాలని, వాటిపై ప్రచారం చేయాలని కోరారు.
కలసి కట్టుగానే...
అందులో భాగంగానే మైలవరం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ జనవరి నుంచి బూత్ కమిటీలను నియమిస్తామని తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో ఒక బూత్ కమిటీ ఉంటుందన్నారు. బూత్ కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ఒక మహిళ కూడా ఉంటారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు 175 చోట్ల గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగన్ కోరారు.