Ys Jagan : మా కుటుంబంలో విభేదాలున్నాయ్.. జగన్ సంచలన కామెంట్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన ప్రసంగం మొత్తం అబద్ధాలేనని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన ప్రసంగం మొత్తం అబద్ధాలేనని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. ప్రజలను పక్కదారి పట్టించి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. హామీలపై స్పష్టత ఇవ్వాల్సి వస్తుందనే బడ్జెట్ ను ఆలస్యం చేశారని జగన్ అన్నారు. తమ హయాంలో అప్పులు ఎక్కువగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాగ్ రిపోర్ట్ పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలను తప్పు పట్టించే విధంగా....
తాము పథ్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశామని సభను తప్పుదోవపట్టించే విధంగా మాట్లాడటం సబబా? అని చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అబద్ధాలు మీద అబద్ధాలు చెబుతూ ప్రజలను కూడా తప్పుదోవపట్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఏవీ చేయకుండా తమ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టిందన్న వైఎస్ జగన్ ప్రజలు ఎవరూ చంద్రబాబు మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరని అన్నారు. బాబు హామీలను అమలుపర్చకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలకు రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేయడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారని వైఎస్ జగన్ అన్నారు. తన కుటుంబంలో విభేధాలున్నాయని, తల్లీ చెల్లి అంటూ చంద్రబాబు క్రూరమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు తన చెల్లెలు వైఎస్ షర్మిల మీద తప్పుడు రాతలు రాయించింది నిజం కాదా? అని జగన్ ప్రశ్నించారు.