Prakasham Barrage ప్రకాశం బ్యారేజీ బోట్ల ఆరోపణలపై వైఎస్ జగన్ ఆగ్రహం

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ఆరోపణలను ఖండించారు

Update: 2024-09-11 07:53 GMT

ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లను బోట్లు కొట్టుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ప్రకాశం బ్యారేజి వద్ద 67, 68, 69 నెంబరు గేట్ల వద్ద 4 బోట్లు చిక్కుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన ఈ బోట్లు బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఏపీ ప్రభుత్వం 67, 69 నెంబరు గేట్లకు యుద్ధ ప్రాతిపదికన కొత్త కౌంటర్ వెయిట్లు అమర్చింది. అయితే ఈ బోట్ల విషయంలో టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలని ప్రయత్నించారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఏపీ హోం మంత్రి అనిత బ్యారేజీని ఢీకొన్న ఐదు బోట్లు ప్రమాదవశాత్తు రాలేదని, ఇది మేన్ మేడ్ ఇన్సిడెంట్ అని చెప్పారు. తొలుత బోట్లు కొట్టుకొచ్చాయనే అనుకున్నామని కానీ ఘటనపై విచారణ జరిపించిన తర్వాత షాకింగ్ విషయాలు తెలిశాయన్నారు. ప్రజల ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యారని అలాంటి వాళ్లను దేశద్రోహులుగా పరిగణించాలన్నారు.

ఈ ఆరోపణలను వైసీపీ బలంగా తిప్పికొట్టింది. గేట్లను ఢీకొట్టిన బోట్లు టీడీపీ నేతలవేనని ఆ పార్టీ సోషల్ మీడియా ఖాతాలలో వీడియోలను పంచుకున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ఆరోపణలను ఖండించారు. చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారని, బోట్లకు ఎవరి హయాంలో పర్మిషన్‌ వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు గెలవగానే ఇదే బోట్లపై విజయోత్సవాలు చేశారని, బాబు, లోకేష్‌తో కలిసి బోటు ఓనర్‌ ఉషాద్రి ఫొటోలు దిగాడన్నారు. టీడీపీ హయాంలోనే ఈ బోట్లకు అనుమతి ఇచ్చారని, ఈ బోట్లన్నీ టీడీపీ నేతలకు చెందినవేనన్నారు. వాస్తవాలు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని, ప్రజలకు తోడుగా నిలవకుండా నేరాన్ని వైసీపీపై నెడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తుపాను వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని, తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ముంచారని ఆరోపించారు. బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని, చంద్రబాబు చేసిన తప్పుడు పనికి 60 మందికిపైగా చనిపోయారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.


Tags:    

Similar News