Ys Jagan : ఏటా ఇక "ఆడుదాం ఆంధ్ర"
గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా మలచడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం వైఎస్ జగన్ అన్నారు
గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులగా మలచడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సచివాలయం స్థాయి నుంచి మండల స్థాయికి,, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి.. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఈ పోటీలు నిర్వహిస్తామని జగన్ తెలిపారు.
వ్యాధులు దూరం...
ప్రతి ఏడాది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందని జగన్ తెలిపారు. గ్రామాల్లో ఆణిముత్యాలను వెలికి తీసి అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యాయామం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు కంట్రోల్ లో ఉంటాయని అన్నారు. 47 రోజుల పాటు ఆటల పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. సచివాలయం స్థాయి నుంచే స్పోర్ట్స్ కిట్స్ ను అందిస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్లే గ్రౌండ్లను ఏర్పాటు చేసుకుని ఆటలను ప్రోత్సహిస్తామని జగన్ తెలిపారు.
దేశ చరిత్రలోనే...
ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని జగన్ అభిప్రాయపడ్డారు. క్రీడాకారులందరూ పాల్గొనే ఒక గొప్ప పండగ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూస్తేనే ఏపీలో క్రీడల పట్ల ఎంత ఉత్సాహంగా ఉన్నారో అర్థమవుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కోటి మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ క్రీడా సంబరం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. పకడ్బందీగా నిర్వహించి ప్రతి ఏటా మంచి క్రీడాకారులను వెలికి తీయాలని ఆయన కోరారు. అనంతరం క్రీడాకారుల చేత జగన్ ప్రమాణం చేయించారు.