అధికార పార్టీకి గుడ్ బై.. ప్రతిపక్షానికి జై కొట్టిన వైసీపీ కీలక నేత
2014 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ అధికార పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పెద్దాపురానికి చెందిన కీలక నేత బొడ్డు వెంకటరమణ చౌదరి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6న ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇటీవల పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణా రెడ్డితో కలిసి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన పార్టీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం.
తొలుత ఈ నెల 3న ఆయన పార్టీలో చేరతారని భావించినా.. 6వ తేదీన తూర్పు గోదావరి పర్యటనలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దివంగత నేత బొడ్డు భాస్కర రామారావు తనయుడే వెంటకరమణ. పెద్దాపురం నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండుసార్లు భాస్కర రామారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా టీడీపీలో కీలక నేతగా ఎదగడంతో పాటు ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు.
2004,2009లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పటికీ వైఎస్ హవాలో రామారావు గెలవలేకపోయారు. అనంతరం ఎమ్మెల్సీగా కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు భాస్కర రామారావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2014లో బొడ్డు భాస్కర రామారావు వారసుడిగా వెంకటరమణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వెంకటరమణ చౌదరి సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత మురళీమోహన్ చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో ఆయన రెండోస్థానానికి పరిమితమయ్యారు.
అప్పటి నుంచి ఆయన వైసీపీలోనే కొనసాగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరైన గుర్తింపు లేకపోవడంతో కొద్దిరోజులుగా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. సొంతగూటికి తిరిగి వచ్చేయాలని భావించిన బొడ్డు వెంకటరమణ టీడీపీ సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరోరెండు రోజుల్లో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు.