సిక్కింలో ఘోర ప్రమాదం.. 16 మంది జవాన్లు వీరమరణం
మరో నలుగురు సైనికులు గాయపడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో.. రోడ్డు మీద వెళ్తున్న ఈ ట్రక్కు అకస్మాత్తుగా
భారతదేశం-చైనా సరిహద్దు సమీపంలోని ఉత్తర సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత ఆర్మీ ట్రక్కు లోయలో పడిపోయింది. ఆ సమయంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న సైనికుల్లో 16 మంది అమరులయ్యారు. మరో నలుగురు సైనికులు గాయపడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో.. రోడ్డు మీద వెళ్తున్న ఈ ట్రక్కు అకస్మాత్తుగా రోడ్డుపై నుంచి జారి లోయలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంపై తమకు సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు.
ప్రమాద ఘటనలో గాయపడిన సైనికులను ఉత్తర బెంగాల్లోని సైనిక ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో సైనికులు అమరులవ్వడంపై.. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాచెన్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెమా 3 వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.