ఇద్దరు రౌడీలను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
తమిళనాడు పోలీసు అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు రౌడీ షీటర్లను
తమిళనాడు పోలీసు అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు రౌడీ షీటర్లను ఎన్ కౌంటర్ చేశారు. గుడువాంచెరి సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్నప్పుడు పోలీసు సిబ్బందిపై ఇద్దరు రౌడీలు దాడి చేశారు. దీంతో ఆ ఇద్దరినీ కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఎస్ వినోద్ అలియాస్ ఛోటా వినోద్, ఎస్ రమేశ్ లుగా గుర్తించారు. వీరిపై హత్య, హత్యాయత్నం, దోపిడీతో సహా వరుసగా చాలా కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు.
గుడువాంచేరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరణై-పుదుచ్చేరి-అరుంగల్ రహదారిపై ఇన్‌స్పెక్టర్ మురుగేషన్ నేతృత్వంలోని బృందం వాహన తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నల్లటి స్కోడా కారు అదుపు తప్పి పోలీసు జీపును ఢీకొట్టింది. కారు ఆపమని పోలీసులు అడిగినా వాళ్లు ఆపలేదు. వెంటనే వినోద్, రమేష్ సహా నలుగురు సాయుధ వ్యక్తులు బయటకు వచ్చి పోలీసు సిబ్బందిపై దాడికి యత్నించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌పై కొడవలితో దాడి చేయగా.. ఆయన ఎడమ చేతికి గాయమైంది. వెంటనే పోలీసులు ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపారు. మిగిలిన ఇద్దరు ఆయుధాలతో అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన పోలీసు అధికారిని క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నిందితులను చెంగల్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది.