వైద్యం వికటించి చిన్నారి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమంటున్న తల్లిదండ్రులు

చిన్నారికి కంటిమీద కురుపు వేయడంతో.. వైద్యం చేయించేందుకు నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ లో చేర్చారు తల్లిదండ్రులు.

Update: 2022-05-14 07:49 GMT

గుంటూరు : కొద్దిరోజులుగా జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరాధ్య(5).. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చిన్నారికి కంటిమీద కురుపు వేయడంతో.. వైద్యం చేయించేందుకు నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ లో చేర్చారు తల్లిదండ్రులు. వైద్యులు చిన్నారికి శస్త్రచికిత్స చేశారు. కానీ.. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరాధ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై పెట్టారు. పాప ఆరోగ్య పరిస్థితి బాగోలేదు.. ఇంతకుముందు ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయా అని జీజీహెచ్ వైద్యులు తల్లిదండ్రులను ప్రశ్నించారు. వెంటిలేటర్ పై పెట్టినా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. జీజీహెచ్ నుంచి రమేష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆరాధ్య వెంటిలేటర్ కే పరిమితమైంది.

చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు రమేష్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దాంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెంకు చెందిన పావని, ఏడుకొండలు కుమార్తె ఆరాధ్య(5). చిన్నారి తల్లిదండ్రలు కోర్టు సముదాయం వద్ద జిరాక్స్ షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఆరాధ్య చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే ప్రధానకారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.






Tags:    

Similar News