శివుడి ఆజ్ఞంటూ.. బాలుడి నరబలి

ఒక శివాలయానికి వెళ్లాడు. అక్కడ చాలా మంది భజనలు, పూజలు చేస్తున్నారు. తాను కూడా పూజలు చేస్తానని, ధూపం ఇవ్వాలని..

Update: 2022-10-03 14:42 GMT

టెక్నాలజీ యుగంలో ఇంకా మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. మూఢనమ్మకాలు లేవని ఎంత అవగాహన కల్పించినా.. తమ నమ్మకం తమదేనంటూ గుడ్డిగా వెళ్తున్నారు. సాటి మనిషి ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడటం లేదు. తనకి శివుడి ఆజ్ఞ అంటూ.. ఓ వ్యక్తి చిన్నారిని నరబలి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీ పరిధిలోని లోధి కాలనీలో విజయ్ అనే వ్యక్తి శనివారం రాత్రిపూట గంజాయి సేవించాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఒక శివాలయానికి వెళ్లాడు. అక్కడ చాలా మంది భజనలు, పూజలు చేస్తున్నారు. తాను కూడా పూజలు చేస్తానని, ధూపం ఇవ్వాలని అక్కడున్న వారిని అడిగాడు. కానీ అతను మత్తులో ఉండటంతో.. అందుకు నిరాకరించారు. అనంతరం అక్కడ్నుంచి ఇంటికి చేరుకున్న విజయ్ తనను శివుడు నర బలికోరుతున్నట్లు భ్రమపడ్డాడు. ఇంటి నుంచి బయటికెళ్లగా.. ఆరేళ్ల బాలుడు ఒంటరిగా కనిపించాడు. వెంటనే అపహరించి.. సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లోకి తీసుకెళ్లాడు. బాలుడి గొంతు, మెడకోసి హత్య చేశాడు. విజయ్ కు మరో వ్యక్తి కూడా సహకరించాడు.
ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత తమ బాబు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. నిందితుడి ఇంటి వద్ద రక్తపు మరకల్ని గుర్తించి.. ఆరా తీశారు. జరిగిన దారుణం తెలియడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలం నుంచి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News