ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
యమున ఎక్స్ ప్రెస్ వే పై వెళ్తున్న కారు.. అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
మధుర : ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. యూపీలోని మధురలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. యమున ఎక్స్ ప్రెస్ వే పై వెళ్తున్న కారు.. అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో 9 మంది ఉండగా.. ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నా ప్రమాద స్థలంలోని ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసదుపాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ హృదయ విదారక ఘటనపై దిగ్భ్రాంతి చెందారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత వైద్యులు, అధికారులకు సూచించారు. కాగా.. బాధితులంతా ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా.. మధురలోని నౌజీల్‌లో 68వ మైలురాయి వద్ద ప్రమాదం జరిగింది.