మోకాళ్లపై కూర్చోబెట్టిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్య
హయత్ నగర్లోని ఓ స్కూల్లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో గురువారం అక్షయను టీచర్ మందలించింది.
ఈ రోజుల్లో పిల్లలు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారనో, ఫోన్ కొనివ్వలేదనో, స్కూల్లో టీచర్ తిట్టిందనో ఇలా చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్లో చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదని టీచర్ క్లాస్ లో అందరి ముందు మోకాళ్లపై నిలబెట్టడంతో.. అవమానంగా భావించిన 8వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హయత్ నగర్లోని ఓ స్కూల్లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో గురువారం అక్షయను టీచర్ మందలించింది. పనిష్మెంట్ గా క్లాస్ బయట మోకాళ్లపై నిలబెట్టింది. దానిని అవమానంగా భావించిన అక్షయ మనస్తాపానికి గురైంది. ఇంటికెళ్లాక ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. తమ కూతురి మరణానికి స్కూల్ యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు మండిపడ్డారు. బాలిక తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. అందరి ముందూ టీచర్ అవమానించడం వల్లే అక్షయ ఆత్మహత్య చేసుకుందన్నారు. సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తే నిజాలు బయటపడతాయన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్ యాజమాన్యాన్ని ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.