ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. కారణం తెలిస్తే
ఆదివారం రాత్రి అంబికానగర్‌లో విషం సేవించి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి
మహారాష్ట్రలోని సాంగ్లీలో ఒకే ఇంట్లో 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులంతా విషం తాగి మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరిలో ముగ్గురి మృతదేహాలు ఒకే చోట పడివుండగా, మిగిలిన ఆరు మృతదేహాలు ఇంట్లో వివిధ చోట్ల పడివుండడాన్ని పోలీసులు గుర్తించారు. వారంతా విషం తాగి చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోస్టుమార్టం అనంతరం దీనిపై స్పష్టత రానుంది. వారి ఆత్మహత్యకు కారణమేంటన్నది తెలియరాలేదు.
ఆదివారం రాత్రి అంబికానగర్‌లో విషం సేవించి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మానిక్ వాన్‌మోర్, పోపట్ వాన్‌మోర్ అనే ఇద్దరు సోదరులు వారి కుటుంబ సభ్యులు సహా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుల్లో తల్లి, భార్య, పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం మృతదేహాలు లభ్యం కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోపట్ యల్లప్ప వాన్‌మోర్ (వయస్సు 52), సంగీతా పోపట్ వాన్‌మోర్ (48), అర్చన పోపట్ వాన్‌మోర్ (30), శుభమ్ పోపట్ వాన్‌మోర్ (28), మానిక్ యల్లప్ప వాన్‌మోర్ (49), రేఖ మానిక్ వాన్‌మోర్ (45), ఆదిత్య మానిక్ వాన్మోర్ (15), అనితా మానిక్ వాన్మోర్ (28), అక్కాటై వాన్మోర్ (72) చనిపోయిన వారీగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. . "మేము ఒక ఇంట్లో తొమ్మిది మృతదేహాలను కనుగొన్నాము. మూడు మృతదేహాలు ఒకే చోట, ఆరు ఇతర వేర్వేరు ప్రదేశాలలో ఇంట్లో లభ్యమయ్యాయి" అని సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడమ్ చెప్పారు.