వ్యక్తి ప్రాణం తీసిన ఫోన్ లౌడ్ స్పీకర్
అలవాటు ప్రకారం ఫోన్ పట్టుకుని రోడ్డుమీదికి వచ్చి.. లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో టూ వీలర్ పై..
కొంతమందికి ఫోన్ కాల్ లౌడ్ స్పీకర్ లో పెట్టి మాట్లాడటం అలవాటు. కొందరికి వినికిడి లోపమైతే.. మరికొందరికి అలా మాట్లాడటమే సౌకర్యంగా ఉంటుంది. కానీ.. ఒక్కోసారి ఆ లౌడ్ స్పీకర్లో వచ్చే మాటలే ప్రాణం మీదికి తెస్తాయనేందుకు ఇలాంటి ఘటనలే ఉదాహరణ. విశాఖ జిల్లాలో ఓ వ్యక్తి ఫోన్ కాల్ ను లౌడ్ స్పీకర్ లో పెట్టి మాట్లాడటంతో.. దాని వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ కారణంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఫలితంగా ఒకరి ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిగుండం సమీపంలోని రామవరంకు చెందిన అక్కిరెడ్డి బంగార్రాజుకు ఫోన్ కాల్ వచ్చింది.
అలవాటు ప్రకారం ఫోన్ పట్టుకుని రోడ్డుమీదికి వచ్చి.. లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో టూ వీలర్ పై యారాడకు చెందిన బాక్సర్ బంక అజయ్ (33) తన స్నేహితుడు రమణతో అటువైపుగా వెళ్తున్నాడు. అజయ్ కు కూడా ఫోన్ కాల్ రావడంతో బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతున్నాడు. రోడ్డుమీద బంగార్రాజు లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండటంతో అజయ్ ఇబ్బంది పడ్డాడు. తనకు కూడా ఫోన్ వచ్చిందని, లౌడ్ స్పీకర్ పెట్టి అంతగట్టిగా మాట్లాడుతావేంటి అంటూ.. అజయ్ బంగార్రాజుపై సీరియస్ అయ్యాడు. ‘నా ఊళ్లో నేను నా ఇంటి దగ్గర మాట్లాడితే నీకెందుకు అని అజయ్ కు బదులిచిచ్చాడు బంగార్రాజు.
దీంతో అజయ్‌కి కోపం వచ్చి గట్టిగా అరిచాడు. మా ఊరికొచ్చి.. నా పైనే దురుసుగా మాట్లాడుతారా అంటూ బంగార్రాజు కూడా ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం.. ఘర్షణకు దారితీసింది. బంగార్రాజు భార్య, మామ భీమవరపు దేముడు (49) కూడా బాక్సర్ అజయ్‌ను ప్రశ్నించేందుకు బయటకు వచ్చారు. దీంతో.. అజయ్ మరింత ఊగిపోతూ బంగార్రాజు, దేముడిపై దాడి చేశాడు. దాంతో దేముడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫోన్ కాల్ లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడటం అనే చిన్న విషయానికి.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ.. అలా ఒకరి ప్రాణం తీయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిందితుడైన అజయ్ బాక్సర్ కావడంతో.. అతను కొట్టిన ఒక్క దెబ్బకే దేముడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. అలాగే బంగార్రాజుకు స్వల్పగాయాలయ్యాయి.