బాణసంచా గిడ్డంగిలో అగ్నిప్రమాదం.. ముగ్గురి సజీవదహనం
గిడ్డంగి యజమాని అయిన వీరరాఘవులు, కల్యాణ్ కుమార్ కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సూళ్లూరుపేట..;
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం(మే31) మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో కువ్వాకుల్లికి చెందిన ముగ్గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతులు సాధు నాగేంద్ర(26), శంకరయ్య(36), ఏడుకొండలు(45) గా గుర్తించారు. గిడ్డంగి యజమాని అయిన వీరరాఘవులు, కల్యాణ్ కుమార్ కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించి, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కాగా.. గిడ్డంగిలోని బాణసంచా పేలుతుండటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి, ఎస్సై పురుషోత్తం రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందా ? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.