వీడియో గేమ్ ఆడుతుండగా పేలిన ఫోన్.. చిన్నారి మృతి
కొందరు అవసరానికే స్మార్ట్ ఫోన్ ను వాడినా.. చాలా నూటికి 95 శాతం మంది స్మార్ట్ ఫోన్ లో ఉండే గేమ్స్, రీల్స్, ఇతరత్రా..
పసి పిల్లల నుండి.. ఆరు పదుల వయసు దాటిన వృద్ధుల వరకూ.. అరచేతిలో ఆరంగుళాల ఫోన్ లేనిదే రోజు గడవట్లేదు. కొందరు అవసరానికే స్మార్ట్ ఫోన్ ను వాడినా.. చాలా నూటికి 95 శాతం మంది స్మార్ట్ ఫోన్ లో ఉండే గేమ్స్, రీల్స్, ఇతరత్రా వీడియోలు చూసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా స్మార్ట్ ఫోన్ లో గ్యాప్ లేకుండా వీడియో గేమ్స్ ఆడటంతో అది కాస్తా పేలి ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 24) రాత్రి చోటుచేసుకుంది.
జిల్లాలోని తిరువిల్వామలకు చెందిన ఆదిత్యశ్రీ అనే చిన్నారి 3వ తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి తండ్రి మొబైల్ ఫోన్ తీసుకుని గ్యాప్ లేకుండా గేమ్స్ ఆడుతూ కూర్చుంది. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి.. హీటెక్కినా గేమ్స్ ఆడటం ఆపలేదు. మొబైల్ కు ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్ ఆడుతుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆదిత్యశ్రీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై పజ్యన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఫోరెన్సిక్ తనిఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు.