నెలరోజులుగా వాటర్ ట్యాంక్ లో మృతదేహం.. ఆ నీటినే తాగుతున్న స్థానికులు
ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.
ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి ట్యాంక్ లో మృతదేహం కనిపించడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది. వెంటనే వారు పోలీసులు సమాచారమివ్వగా.. ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్లు అక్కడికి చేరుకున్నారు. సుమారు 40 - 50 రోజులుగా ఆ మృతదేహం వాటర్ ట్యాంక్ లోనే ఉండటంతో.. పూర్తిగా కుళ్లిపోయింది.
అనేక కాలనీలు...
శివస్థాన్ పూర్, ఎస్ ఆర్కే నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు ఈ ట్యాంక్ నుంచే నిత్యం తాగునీరు సరఫరా జరుగుతోంది. దీంతో స్థానికులు ఇన్ని రోజులుగా తాము ఈ నీటినేనా తాగుతోంది అని భయాందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం వెంట్రుకలు బాగా నానిన చిన్న చిన్న మాంసపు ముక్కలు మంచినీళ్లలో వచ్చాయని బస్తీ వాసులు వాపోతున్నారు. కాగా.. వాటర్ ట్యాంక్ పై చెప్పులు లభ్యమవ్వడంతో అవి మృతుడివేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాస్పద మృతిగా...
స్థానికులు తెలిపిన వివరాలు.. వాటర్ ట్యాంక్ వద్ద లభ్యమైన ఆధారాలతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు మృతుడు ఎవరు ? ఎందుకు ఇక్కడ శవంగా పడి ఉన్నాడు ? అతనిది ఆత్మహత్యా ? లేక ఎవరైనా హత్య చేసి వాటర్ ట్యాంక్ లో పడేశారా ? అన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.