యువతిపై అత్యాచారయత్నం.. డయల్ 100కు కాల్ చేయడంతో..
ఆటోడ్రైవర్ యువతి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో.. వెంటనే ఆమె డయల్ 100 కు కాల్ చేసింది. యువతి ఫోన్ కాల్ ఆధారంగా
విజయవాడ : మరో యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగింది. నూజివీడుకు చెందిన యువతికి బెంగళూరుకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన స్నేహితుడు విజయవాడ వచ్చినట్లు తెలుసుకున్న యువతి.. అతడిని కలిసేందుకు నగరానికి వచ్చింది. తన స్నేహితుడు ఉన్న హెటల్ అడ్రస్ చూపిస్తానంటూ యువతిని ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకుని నేరుగా నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు.
యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో.. వెంటనే డయల్ 100కు కాల్ చేయగా.. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని యువతిని రక్షించారు. అందుకు సంబంధించిన వివరాలను సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు. గతరాత్రి 10 గంటలకు యువతి తన స్నేహితుడిని కలిసేందుకు విజయవాడకు వచ్చింది. స్నేహితుడు ఉంటున్న హోటల్ అడ్రస్ కోసం ఆటో డ్రైవర్ ను ఆశ్రయించగా.. కిరాయి విషయంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగినట్లు సీపీ తెలిపారు.
ఆటోడ్రైవర్ యువతి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో.. వెంటనే ఆమె డయల్ 100 కు కాల్ చేసింది. యువతి ఫోన్ కాల్ ఆధారంగా 5 నిమిషాల్లోనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆటోడ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని క్షేమంగా ఇంటికి చేర్చినట్లు సీపీ కాంతిరాణా పేర్కొన్నారు. మహిళలు,యువతులు ఒంటరిగా సమయం కాని సమయంలో బయటకు వచ్చేటప్పుడు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిదని.. సీపీ ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యంగా ముఖపరిచయం లేని వ్యక్తులను నమ్మొద్దని తెలిపారు. మహిళలు, యువతులంతా దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆపదలో ఉన్న సమయంలో అదే రక్షణకవచంలా ఉపయోగపడుతుందని కాంతిరాణా తెలిపారు.