ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. షాక్ తో సెక్యూరిటీ గార్డుకు గుండెపోటు
ధరణేశ్వర్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను, సిబ్బందిని విచారించారు. పులివెందులకు..
తిరుపతి జిల్లా గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ సెకండియర్ చదువుతోన్న ధరణేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులుకి చెప్పగా.. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ రెండు మరణాలతో తోటి విద్యార్థులతో పాటు.. కళాశాల సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న గూడురు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. ధరణేశ్వర్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను, సిబ్బందిని విచారించారు. పులివెందులకు చెందిన అతను గూడురు హాస్టల్ లో ఉండి ప్రస్తుతం బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. అయితే.. అతని బ్యాగులో కత్తి ఉన్నట్లు హాస్టల్ సిబ్బంది గుర్తించగా.. ఆ బ్యాగును స్టోర్ సిబ్బంది తీసుకెళ్లినట్లు విద్యార్థులు తెలిపారు. తన బ్యాగును తీసుకెళ్లడం వల్లే ధరణేశ్వర్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడా? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
విద్యార్థి ధరణేశ్వర్‌రెడ్డి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకున్న విషయం హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులుకు తెలిసింది. దాంతో ఆయన కంగారుపడగా.. ఛాతిలోనొప్పి వచ్చి , గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఒకేరోజు హాస్టల్లో ఇద్దరు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.