Iphone Murder : విద్యార్థి ప్రాణం తీసిన ఐ ఫోన్ మోజు
ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి అబ్దుల్లా ఐఫోన్ కోసం.. బాట్లా హౌస్ జామియా నగర్ లో నివాసం ఉండే క్యాబ్ డ్రైవర్..
ఈ టెక్నాలజీ యుగంలో యువత చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని ఇల్లంటూ లేదు. ఒకవేళ ఎవరింట్లోనైనా లేకపోతే అది కొనేంతవరకూ పిల్లలు ఊరుకోవడం లేదు. ఫోన్ కొనకపోతే చచ్చిపోతానని బెదిరించి ప్రాణాలు తీసుకున్న ఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు ఐ ఫోన్ కోసం అప్పు చేసి.. తీర్చలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని సౌత్ ఈస్ట్ జామియా నగర్లో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి అబ్దుల్లా ఐఫోన్ కోసం.. బాట్లా హౌస్ జామియా నగర్ లో నివాసం ఉండే క్యాబ్ డ్రైవర్ ఖలీద్(24) దగ్గర రూ.72వేలు అప్పు చేశాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్ అడిగినా అబ్దుల్లా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు అడిగినా సరైన జవాబు లేకపోవడంతో ఖలీద్ కోపంతో రగిలిపోయాడు. వెంటనే తనవద్దనున్న పిస్టల్ తో అబ్దుల్లా ను కాల్చి చంపాడు. అనంతరం తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 302(మర్డర్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన సోదరుడు మహమ్మద్ అబ్దుల్లాను.. క్యాబ్ డ్రైవర్ కాల్చి చంపిన సమయంలో తాను ఇంటి లోపల ఉన్నట్లు అబ్దుల్లా సోదరుడు ఆసిఫ్ చెప్పాడు.