స్కూల్ బస్సును ఢీ కొట్టిన కారు.. ఆరుగురి మృతి
ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఘజియాబాద్ పోలీసులు..
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిద్రమత్తులో వాహనాలు నడపడం, రాంగ్ రూట్ అని తెలిసి కూడా వెళ్లడం.. ఇలా రకరకాల కారణాల వల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా రోడ్డుప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తెల్లవారుజామున ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. యూపీలోని ఘజియాబాద్ లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగింది. నగరంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఓ బస్సు, కారు ఢీ కొన్నాయి. రాంగ్ రూట్ లో వస్తున్న బస్సును.. వేగంగా వస్తున్న కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఘజియాబాద్ పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను కట్టర్ల సాయంతో బయటకు తీసి, పోస్టుమార్టం కు పంపారు. రిపబ్లిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాహుల్ విహార్ వద్ద లాల్ కౌన్- ఢిల్లీ 9వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని రూరల్ జోన్ డీసీపీ చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.