కార్వీ గ్రూపు పై మరో కేసు నమోదు
గతంలో ఈ కార్వీ సంస్థపై కేసు నమోదు కావడంతో పోలీసులు సంస్థ ఎండిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన
కార్వీ గ్రూపుపై హైదరాబాద్ సిసిఎస్ లో మరో కేసు నమోదయ్యింది. లక్ష్మీ నివాస్ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కార్వీ గ్రూప్ సంస్థపై కేసు నమోదు చేశారు. గతంలో ఈ కార్వీ సంస్థపై కేసు నమోదు కావడంతో పోలీసులు సంస్థ ఎండిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి కార్వీ గ్రూప్స్ 75 కోట్ల రూపాయలను రుణం తీసుకుంది. అయితే తమ వద్ద తీసుకున్న కొన్ని కోట్ల రూపాయల రుణాన్ని కార్వీ సంస్థ నిర్వాహకులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కోర్టును ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 2017లో కార్వీ రియాల్టీకి లక్ష్మీ విలాస్ బ్యాంక్ 75 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది.
దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం అంటూ కార్వీ గ్రూప్స్ లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి 75 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఆ విధంగా తీసుకున్న కోట్ల రూపాయలను నిర్వాహకులు కార్వీ రియాల్టీ నుండి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కు బదిలీ చేయడం జరిగింది. అయితే నిర్వాహకులు రహస్యంగా చేసిన ఈ బదిలీ కాస్త వెలుగులోకి రావడంతో విషయం తెలుసుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ అధికారులు వెంటనే తాము ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేశారంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రిఫరెన్స్ తో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కార్వీగ్రూప్స్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.