డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.25 లక్షల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం

హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు

Update: 2021-12-15 12:42 GMT

హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన ముఠా నుంచి ఐదున్నర లీటర్ల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ హాష్ ఆయిల్ విలువ సుమారు రూ.25 లక్షల వరకూ ఉంటుందన్నారు. సంపత్ కిరణ్ కుమార్ అలియాస్ జాన్ అనేవ్యక్తిని అరెస్ట్ చేశామని అతని వద్దనుంచి 3.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాకు చెందిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. ప్రధాన ముద్దాయి అయిన సంపత్ కిరణ్ కుమార్ అలియాస్ జాన్ ఆంధ్రప్రదేశ్, పాడేరు‌లో ఉన్న కొంత మంది డీలర్లు సహాయంతో గంజాయి నుండి హాష్ ఆయిల్ తీసి అమ్మకాలు చేస్తున్నాడు. ఒక గ్రాము ఆయిల్ ను రూ.700 నుంచి రూ.1000 వరకూ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పాడేరుకు చెందిన....
వెస్ట్ జోన్ పరిధిలో మరో ముఠా సభ్యుడు పాడేరుకు చెందిన గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతనివద్ద నుంచి 2 లీటర్ల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసులో కూడా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఇయర్ ఎండింగ్, నూతన సంవత్సర వేడుకలపై దృష్టి సారించామని, పబ్స్ లో మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టి డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలవ్వకుండా చూడాలని అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని, ఈ తనిఖీల్లో పట్టుబడిన వారు ఎంతటివారైనా సరే.. కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News