నిత్యపెళ్లికొడుకు.. మనోడి పెళ్లిళ్ల చరిత్ర చూస్తే షాకవ్వాల్సిందే..
మైసూరు విజయనగరలో అద్దెకు తీసుకున్న ఇంటిని చూపించి.. సొంత ఇల్లు అని నమ్మించాడు. జనవరి 1వ తేదీన..
మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్నాయి. మంచి అమ్మాయి భార్యగా రావాలని వెతుకుతున్నానంటూ.. మ్యాట్రిమోనీల ద్వారా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని.. అవసరం తీరాక వారిని వదిలేయడం ఈ నిత్యపెళ్లికొడుకు ప్లాన్. అలా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 మందిని మోసం చేశాడు. ఇప్పటివరకూ నిత్యపెళ్లికొడుకు అవతారమెత్తిన ప్రబుద్ధులు ఉన్నారు కానీ.. వారంతా నాలుగైదు పెళ్లిళ్లకే దొరికిపోయారు. మనోడు మాత్రం 15 వరకూ వచ్చాడు. కొందరిని పెళ్లి చేసుకుని, మరికొందరితో నిశ్చితార్థం చేసుకుని డబ్బు అందగానే పరార్. వదిలేస్తే.. ఇంకా చేసుకుంటాడు కూడా. ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు మహేశ్ (35) ను కువెంపు నగర పోలీసులు అరెస్ట్ చేసి, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బనశంకరికి చెందిన మహేశ్.. తాను డాక్టర్ ని అంటూ షాదీ డాట్ కామ్ లో హేమలత (30) అనే యువతికి పరిచయమయ్యాడు. మైసూరు విజయనగరలో అద్దెకు తీసుకున్న ఇంటిని చూపించి.. సొంత ఇల్లు అని నమ్మించాడు. జనవరి 1వ తేదీన ఇద్దరూ విశాఖపట్నంలో పెళ్లి చేసుకుని.. మైసూరుకు వెళ్లి కాపురం పెట్టారు. తాను డాక్టర్ ని అని ముందే నమ్మించిన అతడు.. క్లినిక్ పెట్టేందుకు రూ.70 లక్షల నగదు అవసరం అవుతుందని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో చంపేస్తానని బెదిరించాడు. సందుచూసి బీరువాలో ఉన్న రూ.15 లక్షల విలువైన నగలు దొంగిలించి పరారయ్యాడు. భర్త తిరిగొస్తాడని ఎంత ఎదురుచూసిన అతని జాడ లేదు.
ఇంతలో హేమలతను దివ్య అనే మరో మహిళ కలిసి.. మహేశ్ బాగోతాన్ని బయటపెట్టింది. అతడో వంచకుడని, తనను కూడా ఇలాగే పెళ్లిచేసుకుని మోసం చేశాడని చెప్పడంతో.. మహేశ్ పై కువెంపునగర పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆదివారం నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.2 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు, నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మహేశ్ ఇప్పటి వరకూ 15 మంది మహిళలను ఇదే తరహాలో మోసం చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.