ప్రేమే వారిపాలిట శాపం.. కాల్చి చంపేసి మొసళ్ల నదిలో..
రతన్ బసాయ్ గ్రామానికి చెందిన శివానీ తోమర్ (18), పక్కనున్న మరో ఊరికి చెందిన రాధేశ్యామ్ తోమర్ (18) కొన్నాళ్లుగా
ప్రేమ.. కొందరి జీవితాల్లో కొత్తవెలుగులు నింపితే.. మరికొందరి జీవితాల పాలిట శాపమవుతోంది. ప్రేమించడమే పాపంగా భావించి.. పరువు పోతుందని ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పరువుహత్యలు చేశారు. తెలంగాణలోని సూర్యాపేట లో జరిగిన ప్రణయ్ పరువుహత్యను ఇప్పటికీ మరిచిపోలేదు ప్రజలు. తాజాగా.. ఇదే పరువు మరో రెండు ప్రాణాలను బలితీసుకుంది. వాళ్లను చంపడమే కాకుండా.. శరీరాలను మొసళ్లకు మేతగా వేయడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని మొరేనా జిల్లాలో చోటుచేసుకుంది. జూన్ 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రతన్ బసాయ్ గ్రామానికి చెందిన శివానీ తోమర్ (18), పక్కనున్న మరో ఊరికి చెందిన రాధేశ్యామ్ తోమర్ (18) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం శివానీ ఇంట్లో తెలియడంతో కుటుంబీకులు ఇకపై అతడిని కలవొద్దని ఆమెను హెచ్చరించారు. ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉండలేకపోయింది శివానీ. పెద్దలమాట కాదని తరచూ అతడిని కలవడంతో.. శివానీ కుటుంబీకులు కోపంతో రగిలిపోయారు. పొలిమేరలో ఇద్దరినీ కాల్చి చంపారు. అంతటితో ఊరుకోకుండా మృతదేహాలకు బరువైన రాళ్లుకట్టి మొసళ్లు సంచరించే చంబల్ నదిలో పడేశారు.
కొద్దిరోజులుగా తన కొడుకుతో పాటు.. పొరుగూరికి చెందిన యువతి కూడా కనిపించడం లేదంటూ రాధేశ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిద్దరూ ప్రేమించుకుంటున్న సంగతి కూడా చెప్పాడు. దాంతో తొలుత ఇద్దరూ ఎక్కడికైనా పారిపోయుంటారని భావించారు పోలీసులు. కానీ అందుకు తగిన ఆధారాలేవీ దొరకలేదు. అనుమానంతో యువతి తండ్రి, కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. తామే హత్య చేసినట్లు తెలిపారు. మృతదేహాలను మొసళ్లకు మేతగా వేసినట్లు కూడా తెలిపారు. మృతదేహాల కోసం గజఈతగాళ్ల సాయం తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. చంబల్ నదిలో దాదాపు 2500 మొసళ్లు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.