ముడి బాంబుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు
త్వరలో అక్కడ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా బాంబుల తయారీ కేంద్రం ఏర్పాటు కావడమే కాకుండా..
ముడిబాంబుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదం పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లాలో జరిగింది. బాంబుల తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. త్వరలో అక్కడ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా బాంబుల తయారీ కేంద్రం ఏర్పాటు కావడమే కాకుండా.. భారీ పేలుడు జరగడంతో.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా.. వారంరోజుల క్రితం బీహార్ లోని భాగలాపూర్ లో ఓ ఇంటిలో సంభవించిన పేలుడు.. సుమారు నాలుగు ఇళ్లను నేలమట్టం చేసింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. 10 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు శబ్ధం 15 కిలోమీటర్ల వరకూ రావడంతో.. కజ్వలి చాక్ గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇలా వరుస పేలుడు ఘటనలతో బాణసంచా తయారీ కేంద్రాలకు సమీపంలో ఉండే నివాసితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.