క్రికెట్ బెట్టింగ్ కోసం అప్పు.. తీర్చలేక యువకుడి బలవన్మరణం
మధుకుమార్ కు క్రికెట్ బెట్టింగ్ లు కట్టే అలవాటుంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ లో మ్యాచ్ లపై బెట్ లు..
ఐపీఎల్ సీజన్ మొదలైందంటే చాలు.. క్రికెట్ బెట్టింగుల్లో డబ్బు ఏరులై పారుతుంది. లక్ బాగుంటే డబ్బొస్తుంది. ఏ మాత్రం బెడిసికొట్టినా.. బెట్టింగ్ కోసం చేసిన అప్పు మేకై గుచ్చుకుంటుంది. ఫలితంగా ఆ అప్పులను తీర్చలేక ప్రాణం మీదికి తెచ్చుకుంటారు. ఓ యువకుడు అలాంటి అప్పుల ఊబిలోనే చిక్కుకుని తిరిగి కట్టలేక బలవన్మరణం చెందాడు. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పెంటకోట మధుకుమార్ (20) అనకాపల్లిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. మధుకుమార్ కు క్రికెట్ బెట్టింగ్ లు కట్టే అలవాటుంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ లో మ్యాచ్ లపై బెట్ లు కట్టేందుకు తన గ్రామానికే చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. తీసుకున్న అప్పు పెరిగిపోతుండటంతో నర్సింగరావు తన అప్పు తీర్చాలని ఒత్తిడి చేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేక.. చేసిన అప్పు తీర్చలేక ఏప్రిల్ 23 రాత్రి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మధు 25న మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.