ఈడీ నోటీసులు.. వివాదంలోకి మల్లారెడ్డి
క్యాసినోలు నిర్వహించడం ద్వారా విదేశాలకు హవాలా వ్యాపారం చేస్తున్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది
క్యాసినోలను నిర్వహించడం ద్వారా విదేశాలకు హవాలా వ్యాపారం చేస్తున్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం తమ కార్యాలయానికి వచ్చి హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. క్యాసినోలను విదేశాలను నిర్వహిస్తూ వీరిద్దరూ హవాలా ద్వారా సొమ్మును తరలిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈరోజు తెల్లవారు జాము వరకూ వారి ఇళ్లల్లో ఈడీ సోదాలు జరిపింది.
ఎమ్మెల్యే స్టిక్కర్ తో...
ప్రముఖులు, సెలబ్రిటీలతో చీకోటి ప్రవీణ్ కు సంబంధాలున్నాయని సోదాలు గుర్తించారు. నేపాల్ లో జరిపిన క్యాసినోలకు సినీ తారలను కూడా రప్పించారని కనుగొన్నారు. వారికి చెల్లించిన మొత్తంపై ఆరా తీశారు. మరో వైపు మాధవరెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. అయితే మాధవరెడ్డి వాహనానికి మంత్రి మల్లారెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుతుండటాన్ని గమనించిన అధికారులు దానిపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. మల్లారెడ్డి మాత్రం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎవరికీ స్టిక్కర్లు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు.