కరాచీలో భారీ పేలుడు.. 10 మంది దుర్మరణం

కరాచీలోని పరచా చౌక్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ వేస్తుండగా పేలుడు

Update: 2021-12-18 11:05 GMT

పాకిస్థాన్ దేశంలోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 10 మంది దుర్మరణం చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. పేలుడు ధాటికి స్థానికంగా ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. కాగా.. కరాచీలోని పరచా చౌక్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ వేస్తుండగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.


పేలుడు ధాటికి స్థానికంగా ఉన్న భవనం పాక్షికంగా కూలిపోగా.. చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బాంబు డిస్పోజల్ యూనిట్ ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కాగా.. ఆ భవనంలో బ్యాంకు ఉందని, త్వరలోనే దానిని కొత్త ప్రాంతానికి మార్చాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని స్థానికులు వాపోతున్నారు. పేలుడు ఘటనపై సీఎం సింధ్ మురాద్ ఆలీ షా స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేసి, నివేదిక సమర్పించాల్సిందిగా కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News