ఇద్దరు భార్యల మధ్య గొడవలు.. చివరకు భర్త ఏమయ్యాడంటే?
ఇద్దరు భార్యల గొడవలు.. ఆపాలని ఆ భర్త చూశాడు. సర్ది చెప్పాలని ప్రయత్నించాడు.
ఇద్దరు భార్యల గొడవలు.. ఆపాలని ఆ భర్త చూశాడు. సర్ది చెప్పాలని ప్రయత్నించాడు. కానీ వీలు అవ్వలేదు. చివరికి ప్రాణాలే తీసుకోవాల్సి వచ్చింది. తన ఇద్దరు భార్యల మధ్య గొడవలు ఆపలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నిజాంపూర్‌లో చోటు చేసుకుంది.
నిజాంపూర్‌కు చెందిన కుర్మ మారుతి (42)కి, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన మహిళతో వివాహం జరిగింది. కూతురు పుట్టిన తర్వాత కాపురంలో గొడవలు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో ఇరువురు పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకున్నారు. కూతురు పెద్ద అయిన తర్వాత తండ్రి మారుతి పెళ్లి చేసి ఇవ్వాలని ఒప్పందం కుదరగా.. ఆమె బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత మారుతి మహారాష్ట్రకు చెందిన మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.
ఇప్పుడు మొదటి భార్య వచ్చి కూతురి పెళ్లి చేయాలని, లేదంటే ఎకరం భూమిలో వాటా కావాలని ఒత్తిడి తెచ్చింది. మొదటి భార్యకు ఆస్తి ఇస్తే తాను సంసారం చేయనని రెండో భార్య భర్తతో గొడవకు దిగింది. రెండ్రోజుల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకొని ఆమె మహారాష్ట్రలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు భార్యల మధ్య పోరుతో విసిగిపోయాడు మారుతి. అతడి మాట ఎవరూ వినకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఇక తాను బతకకూడదని నిర్ణయించుకుంది మారుతి శుక్రవారం రాత్రి తన పొలంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.