ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. కోవిడ్ రోగి మృతి
బుర్ద్వాన్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కోవిడ్ వార్డులో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో
పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కోవిడ్ వార్డులో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఓ రోగి మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కోవిడ్ వార్డులోని 6వ బ్లాక్ లో ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన మృతుడు ఘల్సీలోని బరమురియా గ్రామానికి చెందిన సంధ్య మండల్ (60)గా గుర్తించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇంకెవరికీ.. ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.
Also Read : ఆర్టీసీ బస్సు బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు
అగ్నిప్రమాదాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది.. వెంటనే మంటలార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు దావానలంలా వ్యాపించడంతో.. రోగులు పరుగులు తీశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది సహకారంతో వార్డు నుంచి అందరినీ బయటకు తీసుకురాగలిగారు. కాగా.. ఆస్పత్రిలో దోమలను చంపే అగరబత్తుల వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు.. ఆసుపత్రి అధికారులు ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫోరెన్సిక్ బృందానికి సమాచారం అందించామని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రబీర్ సేన్ గుప్తా తెలిపారు.