తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు
రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపువద్ద కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్ ముందుభాగంలో మంటలు చెలరేగి..
తిరుపతి : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్ లో వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ కారు అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలుకు చెందిన భక్తులు కారులో తిరుమల కొండపైకి వెళ్తుండగా.. రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపువద్ద కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్ ముందుభాగంలో మంటలు చెలరేగి.. కొద్దిసేపటికే మొత్తం వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కారు ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగడాన్ని భావించిన భక్తులు.. వెంటనే కారులో నుంచి దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టిటిడి అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. శ్రీనివాస సేతు వద్ద జరిగిన మరో ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ముందు వెళ్తున్న కారును.. వెనుక వస్తున్న కారు ఢీ కొట్టడంతో ఫ్రై ఓవర్ పై బోల్తా పడింది. దాంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి, ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.